తక్షణం పంపిణీ చేయండి
Jun 1 2021
ప్రభుత్వ జోక్యం వద్దు.. హైకోర్టు ఆదేశం
ఆనందయ్య మందు తక్షణమే పంపిణీ
ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్స నిమిత్తం ఆనందయ్య అందిస్తున్న మందును తక్షణమే పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయుర్వేద మందు పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆనందయ్య తయారుచేస్తున్న ‘పి’, ‘ఎఫ్’, ‘ఎల్’ మందుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. కంటి చుక్కలు, ‘కె’ మందు విషయంలో నివేదిక అందించాలని నిర్దేశించింది. ‘కె’ మందుకు సంబంధించి శాంపిల్స్ సేకరించి త్వరగా శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. కంటి చుక్కల తయారీ, ‘కె’ మందు పంపిణీపై తగిన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారాని (జూన్ 3)కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) హైకోర్టుకు వివరించారు. కంటి చుక్కల మందుకు సంబంధించి మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కంటి చుక్కలు, ‘కె’ మందు మినహా ఆనందయ్య కొవిడ్ చికిత్సకు అందిస్తున్న మందుల పంపిణీకి ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం.. మందు పంపిణీకి అనుమతించింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనా నివారణకు బి.ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లిఖార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మందు తయారీకి అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు పంపీణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలంటూ అధికారులు తనను వేధిస్తున్నారని ఆనందయ్య కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ మూడు వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.
లైసెన్స్ అక్కర్లేదు: ఆనందయ్య తరఫు న్యాయవాది
ఆనంద య్య చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని.. మందు తయారీ, పంపిణీకి లైసెన్స్ అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ‘డ్రగ్స్, కాస్మొటిక్ చట్టంలోని సెక్షన్ 33(ఈఈసీ) ప్రకారం మినహాయింపు ఉంది. పిటిషనర్‌కు తాను అభివృద్ధి చేసిన మందును విక్రయించే ఆలోచన లేదు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ మందును అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో మందు ఫార్ములాను వెల్లడించడం తప్పనిసరి కాదు. పిటిషనర్ మందుపై పేటెంట్ హక్కులు కలిగి ఉన్నారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీనిని కమర్షియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆందోళన చెందుతున్నారు’ అని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ... రిటైర్డ్ టీచర్ కోటయ్య మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అని కోరారు.
నమూనాల నివేదిక ఏదీ: ధర్మాసనం
మందు పంపిణీ పురోగతి ఏమిటో చెప్పాలని గత విచారణలో సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్భంగా ఽగుర్తు చేసింది. మందు తయారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలియజేస్తూ.. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎ్‌సజీ) హరినాథ్ మెమో దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే హాస్యంగా ఉందా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆనందయ్య మందు పంపిణీని నిలువరిస్తూ ప్రభుత్వం, నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారా అని ఎస్‌జీపీ సుమన్‌ను ప్రశ్నించింది. ఆయుష్ శాఖ సేకరించిన నమూనాల నివేదిక ఎక్కడని ఆరా తీసింది. మందు సక్రమంగా తయారు చేయకపోతే బ్లాక్ ఫంగస్ వస్తుందన్న ఎస్‌జీపీ వాదనలో శాస్త్రీయత లేదని స్పష్టం చేసింది. ఎస్‌జీపీ స్పందిస్తూ.. ఆనందయ్య మందు పంపిణీని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. దీనిపై మండిపడిన ధర్మాసనం.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా నోటి మాటతో మందు పంపిణీని ఎలా అడ్డుకుంటారని నిలదీశారు.
దీంతో.. ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం నిలువరించలేదని.. మందు పంపిణీలో కొవిడ్ నిబంధనలు పాటించలేదని తహశీల్దార్ ఫిర్యాదు చేశారని.. పోలీసులు కేసు నమోదు చేశారని.. ఆయుష్ శాఖ సుమోటోగా మందుపై విచారణ జరిపిందని ఎస్‌జీపీ బదులిచ్చారు. ఆక్సిజన్ స్థాయి పడిపోయినవారికి కంటి చుక్కల మందు ప్రాణాధారంగా పనిచేస్తుందని ఆనందయ్య తరఫు న్యాయవాది తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇదే కీలకమని, చుక్కల మందు ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. రెండు రోజులు వేచిచూడాలని.. విచారణను గురువారానికి వాయిదా వేస్తామని తెలిపింది. కంటి చుక్కలు, కె మందు విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
No comments:
Post a Comment