ఐవర్‌మెక్టిన్‌ను కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం
22Jun 7 2021
న్యూఢిల్లీ: కొవిడ్ రోగుల చికిత్సలో విశేషంగా ఉపయోగపడతాయంటూ విపరీత ప్రచారం జరిగిన ఔషధాలు ఒక్కొక్కటిగా ఆ జాబితా నుంచి జారిపోతున్నాయి. తాజాగా మరికొన్ని ఔషధాలను కేంద్ర ప్రభుత్వం ఆ జాబితా నుంచి తప్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కొవిడ్ రోగుల మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగా ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్‌ను పక్కపెట్టింది.
నిజానికి కొవిడ్ చికిత్సలో ఈ రెండింటితోపాటు ఫావిపిరావిర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డీజీహెచ్ఎస్ తాజా మార్గదర్శకాలు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఆరోగ్యశాఖ మాత్రం ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్‌లను ఉపయోగించాలని చెబుతుండగా, డీజీహెచ్ఎస్ మాత్రం ఈ రెంటింటిని పక్కనపెట్టింది.
మే 27న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో ఆవిరిపట్టడం, విటమిన్ ట్యాబ్లెట్ల ఉపయోగించడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్, ఫావిపిరావిర్‌లను లక్షణాలు లేని, కొద్దిపాటి లక్షణాలున్న కేసుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కొవిడ్ రోగులకు వీటివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని నిపుణులు తేల్చి చెప్పడంతో డీజీహెచ్ఎస్ వాటిని కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగించింది.
డీజీహెచ్ఎస్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేని రోగులకు (కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు తప్ప) ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. స్వల్ప లక్షణాలున్న వారు యాంటీపైరేటిక్ (జ్వరాలు రాకుండా ఆపడానికి, తగ్గించడానికి), యాంటీటసివ్ (దగ్గు నుంచి ఉపశమనం కోసం, తగ్గించడం కోసం) ఉపయోగించవచ్చు. దగ్గుతో బాధపడుతున్నవారు 800ఎంసీజీ బుడెసోనైడ్‌ను ఇన్హేలర్, స్పేస్ డివైజ్ ద్వారా రోజుకు రెండుసార్లు ఐదు రోజులపాటు తీసుకోవచ్చు. అంతకుమించి ఇతర కొవిడ్ నిర్దేశిత మందులు వాడాల్సిన అవసరం లేదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి.
భారత్‌లో భారీ డిమాండ్ ఉన్న రెమ్‌డెసివిర్‌ను ఎంపిక చేసిన కేసుల్లో మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రి పాలైన వారికి ఉపయోగించవచ్చు. అలాగే, వైరస్ సంక్రమించిన పది రోజుల్లోపు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న వారికి ఉపయోగించవచ్చు.
టోసిలీజుమాబ్‌ను తీవ్ర, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించాలి. అలాగే, అనవసరంగా హై రిజల్యూషన్ సీటీ స్కాన్లు వద్దని కూడా తాజా మార్గదర్శకాలు హెచ్చరించాయి.
No comments:
Post a Comment