ఆనందయ్య మందు అప్పటిదాకా బంద్
నివేదికలు వచ్చాకే నిర్ణయం
22May 25 2021
కంటి వైద్యులు, సీసీఆర్‌ఏఎస్ పరిశీలనకు కృష్ణపట్నం ఆనందయ్య మందు శాంపిల్స్
వారంలో వైద్య నివేదికలు రావచ్చు
తర్వాత పంపిణీపై నిర్ణయిస్తాం: జగన్
ఆ మందు హానికరం కాదు
సహజంగా లభించే పదార్థాలతోనే తయారీ
వీటిలో ఆరోగ్యానికి హాని చేసేవి లేవు
ల్యాబ్‌కు శాంపిల్స్.. కొన్ని ఫలితాలు రావాలి
సమావేశంలో ఆయుష్ కమిషనర్ రాములు
పంపిణీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వండి
హైకోర్టులో 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు
అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే పంపిణీపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ (సీసీఆర్‌ఏఎస్), కంటి వైద్యుల నివేదికలు వచ్చేందుకు వారం రోజుల సమయం పట్టవచ్చునని అన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్ -19 నివారణపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ రాములు ముఖ్యమంత్రికి ఇందుకు సంబంధించిన సమాచారం అందించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య మూడున్నర దశాబ్దాలుగా మందును ఇస్తున్నారని రాములు వివరించారు. ఆయన మందులో 18 రకాల ముడి పదార్థాలను వాడుతున్నారని తెలిపారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య మందులో వాడుతున్నారని వివరించారు. మందుల తయారీ విధానమంతా చూపించారని, ఇవన్నీ సహజంగా దొరికేవేనని, వేరేవేవీ వాడడం లేదని వెల్లడించారు. తయారీ ఫార్ములాను కూడా తమకు వివరించారని చెప్పారు.
ఈ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామన్నారు. కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, ఇంకొన్ని రావాల్సి ఉందని రాములు చెప్పారు. ఇంకా ఈ మందు శాంపిళ్లను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ (సీసీఆర్‌ఎఎ్‌స)కు పంపామని వెల్లడించారు. టీటీడీ సహకారంతో పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. సీసీఆర్‌ఎఎస్ వాళ్లు ఈ శాంపిళ్లను 500 మందిపై ప్రయోగించి పరిశీలన చేస్తారని చెప్పారు. ఈ మందు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉందని రాములు చెప్పారు. ఆరేడు రోజుల్లో నివేదిక వస్తుందని రాములు వెల్లడించారు. అలాగే కంటిలో వేసే చుక్కలపై కూడా వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని వైద్యఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఆ ఫలితాలు వచ్చాకే నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందన్నారు.
ఆయుర్వేద మందుగా గుర్తించలేం: రాములు
ఆనందయ్య మందు తయారీకి హాని కలిగించే పదార్థాలను వాడడం లేదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ప్రస్తుతానికి దీనిని ఆయుర్వేద మందుగా తాము గుర్తించడం లేదన్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందయ్య వాడే పదార్థాలు ఆయుర్వేదానికి సంబంధించినవే ఆయినా నిబంధనల ప్రకారం దీనిని గుర్తించలేమన్నారు. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ ఆధారంగా నిర్ణయించాలన్నారు. దీనిని ఆయుర్వేదం మందుగా కాకపోయినా మరో విధంగా ఇవ్వడంపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఆనందయ్య మందును నాటు మందు అని అవమానించడం లేదన్నారు. ప్రభుత్వానికి తాము ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఇప్పటి వరకూ తాము పరిశీలించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, నివేదికలో కూడా అవే విషయాలు ఉంటాయన్నారు.
ఆనందయ్య తయారు చేసే మందును ఆయుష్ శాఖ గుర్తింపు కావాలంటే ఆయన ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆయన ఇచ్చే మందుల్లో నాలుగు రకాల మందులను నోటి ద్వారా, మరో ఐదు రకాల మందులు కళ్లలో డ్రాప్స్ ద్వారా ఉపయోగించవచ్చునన్నారు. మందులు వాడిన కొందరు కొవిడ్ బాధితుల అభిప్రాయాన్ని తీసుకున్నామన్నారు. తానే స్వయంగా కొంత మందితో మాట్లాడినట్లు చెప్పారు. వారంతా బాగానే ఉన్నారని, ఇప్పటి వరకూ ఆయన 70 వేల మందికి మందు పంపిణీ చేశారన్నారు. కొన్ని శాంపిల్స్ హైదరాబాద్‌లోని ల్యాబ్స్‌కు పంపామని, అక్కడ నుంచి కూడా సానుకూలంగా నివేదిక వచ్చిందన్నారు. ఇంకా మందుపై మరో మూడు నివేదికలు రావాల్సి ఉందని, అవి కూడా వచ్చాక మందులు పంపిణీ చేసే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.
‘ఆయుర్వేదం’గా ప్రకటించేలా ఆదేశించండి
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో వేర్వేరుగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లిఖార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయుర్వేద మందు పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని న్యాయవాది మల్లిఖార్జునరావు కోరారు. ఆనందయ్య మందును కొవిడ్‌కు చికిత్సకు అందించే ఆయుర్వేద మందుగా ప్రకటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఉమామహేశ్వరనాయుడు కోరారు. ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు పంపీణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వెకేషన్ అధికారిని కోరారు.
No comments:
Post a Comment