Thursday, May 27, 2021

India Corna - US Magazine

 యూఎస్ వార్తాప‌త్రిక స‌మాచారం ప్రకారం.. భారత్‌లో క‌రోనా మ‌ర‌ణాల‌పై నివ్వెరపరిచే విషయాలు!

 May 27 2021

వాస్తవికతకు అద్దంపట్టని కరోనా అధికారిక గణాంకాలు

దాదాపు 42 లక్షల మంది మృతి.. 70 కోట్ల మందికి కొవిడ్‌ 

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అంచనా.. ప్రాతిపదికగా సీరో నివేదికలు

న్యూయార్క్‌: భారత్‌ ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల గణాంకాల్లో వాస్తవమెంత? క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులపై ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’వార్తాపత్రిక సేకరించిన సమాచారంలో నివ్వెరపరిచే విషయాలు వెలుగుచూశాయి. ఇందుకోసం 12 మందికిపైగా నిపుణుల సహకారాన్ని తీసుకున్నారు. మూడు సీరో సర్వేల సమాచారం, గణాంకవేత్తల సూచనలు ప్రాతిపదికగా అంచనా నివేదికను రూపొందించారు. మే 24 నాటికి దేశంలో కరోనా కేసులు 2.69 కోట్లు, మరణాలు 3.07 లక్షలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. అధికారిక లెక్కల కంటే కరోనా కేసులు 26 రెట్లు ఎక్కువగా నమోదై ఉంటే 70.7 కోట్లకు, మరణాలు 42 లక్షలకు చేరి ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. గ్రామీ ణ ప్రాంతాల్లో చాలావరకు కొవిడ్‌ మరణాలు ఇళ్ల వద్దే సంభవించడం, కొవిడ్‌కు సంబంధించిన యంత్రాంగం పటిష్టంగా లేకపోవడం  వల్ల అధికారిక కేసులు, వాస్తవిక గణాంకాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని నిపుణులు విశ్లేషించారు.  ‘వాస్తవిక కొవిడ్‌ కేసులు’.. 28.5 రెట్లు ఎక్కువ ఉండొచ్చని మొదటి సీరో సర్వే (2020 మే11 -జూన్‌ 4), 26.1 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని మూడో సీరో సర్వే (2020 డిసెంబరు 18 - 2021 జనవరి 6) తెలిపాయని న్యూయార్క్‌ టైమ్స్‌ గుర్తుచేసింది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో సర్వేలు వాస్తవిక పరిస్థితిని అంచనా వేయలేవని అమెరికాలోని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాన్‌ వేన్‌బర్గర్‌ అభిప్రాయపడ్డారు.

అధికారిక గణాంకాలు 

కరోనా కేసులు : 2.69 కోట్లు మరణాలు : 3,07,231

కరోనా ఉధృతి మోస్తరుగా ఉందనుకుంటే.. (అంచనా) 

కరోనా కేసులు : 40.4 కోట్లు (15 రెట్లు ఎక్కువ) 

మరణాలు : 6 లక్షలు  

కరోనా ఉధృతి భారీగా ఉందనుకుంటే.. (అంచనా)

కరోనా కేసులు : 53.9 కోట్లు (20 రెట్లు ఎక్కువ)

మరణాలు : 16 లక్షలు  

కరోనా ఉధృతి అతిభారీగా ఉందనుకుంటే.. (అంచనా)

కరోనా కేసులు : 70.7 కోట్లు (26 రెట్లు ఎక్కువ)

మరణాలు : 42 లక్షలు  

రెండో వేవ్‌ ప్రకారం లెక్కిస్తే.. 

‘‘దడపుట్టిస్తున్న రెండో కరోనా వేవ్‌ ప్రారంభమవడానికి ముందే జనవరిలో భారత్‌లో మూడో జాతీయ సీరో సర్వే జరిగింది. నమోదైన  కేసుల కంటే వాస్తవిక కేసులు 26 రెట్లు ఎక్కువే ఉండొచ్చని అది అంచనా వేసింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఆ లెక్కన గణించినా భారత్‌లో కరోనా కేసులు 70 కోట్లు, మరణాలు 42 లక్షలు దాటాయి’’ -డాక్టర్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌,  డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకానమిక్స్‌ అండ్‌ పాలసీ.


 అమెరికా పత్రికపై భారత్ ఆగ్రహం.. అబద్ధపు రాతలంటూ విమర్శలు

May 28 2021


న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో ప్రతిరోజూ లక్షల పాజిటివ్ కేసులు, వేల మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ గణాంకాల విషయంలో అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వివరాలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ పత్రిక పూర్తిగా ఆధారాలు లేని, అసత్య వివరాలను ప్రచురించిందని విమర్శలు చేసింది. భారత్‌లో వాస్తవంగా ఉన్న పరిస్థితిని కాకుండా,  నిజాలను వక్రీకరిస్తూ వేసిన అంచనాలను ఆధారంగా తీసుకుని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఈ నివేదిక రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. 

No comments:

Post a Comment