వ్యాక్సిన్ ధరల కుంభకోణం - ప్రభాత్ పట్నాయక్
➖➖➖➖➖➖➖
ప్రపంచంలో ఏ దేశంలోనూ చెల్లించనంత ఎక్కువ రేటు ఇక్కడ మనం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు చెల్లిస్తున్నాం. మరే ఇతర దేశంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్ వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. అంటే ప్రైవేటు అమ్మకాలకు అనుమతులివ్వడం ద్వారా మోడీ ప్రభుత్వమే వ్యాక్సిన్ ధరలను ఉత్పత్తిదారులు ఇష్టం వచ్చినట్టు పెంచుకుపోడానికి అవకాశం ఇచ్చిందని, వ్యాక్సిన్ ఉత్పత్తి ఖర్చుకూ, దాని ధరకూ ఎటువంటి సంబంధమూ లేదని అనుకోవాలి.
ఒక వైపు దేశం యావత్తూ ఈ శతాబ్దపు అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సంక్షోభంలో సతమతమౌతోంది. ఈ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు లాభాలు పిండుకునేందుకు ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడానికి తయారైపోయారు. మోడీ ప్రభుత్వపు చేతకానితనం అనండి, లేకపోతే సహకారం అనండి- వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు బాగా కలిసి వచ్చింది.
ఈ విషయంలో ముందు రెండు విషయాలు మనం విడివిడిగా చూడాలి. మొదటిది : వినియోగదారుడికి వ్యాక్సిన్ ఏ రేటుకు అందించాలి ? పూర్తిగా ఉచితంగా అందించాలి అన్నది స్పష్టం. ఈ విషయాన్ని గతంలో మోడీ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరించిన డా|| అరవింద్ సుబ్రమణ్యం కూడా నొక్కి చెప్పారు. ఇక రెండవది : ఉత్పత్తిదారులకు ఏ రేటు చెల్లించాలి ? ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటు వాళ్ళే నిర్ణయించుకోవచ్చునని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం డోసుకి రూ.150 రేటుకి ఇస్తే చాలునని కేంద్రం నిర్ణయించింది. దాంతో ఆ ఉత్పత్తిదారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ మార్కెటుకు అమ్మే దగ్గర విపరీతంగా ధరలు పెంచి దోచుకుంటున్నారు.
ఇలా ఇష్టం వచ్చిన విధంగా రేట్లు నిర్ణయించడాన్ని సమర్ధించుకుంటూ ఆ ఉత్పత్తిదారులు తమ మోసాన్ని కప్పిపుచ్చుకునే రీతిలో, అవాస్తవాలతో, అసందర్భమైన వాదనలను ముందుకు తెస్తున్నారు. తలా, తోకా లేని విధంగా ఉన్నాయి ఆ వాదనలు. ముందు సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ సంగతే చూద్దాం. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా సంస్థ పెంపొందించిన టెక్నాలజీని ఉపయోగించుకుని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ ) ఇక్కడ కోవిషీల్డ్ ఉత్పత్తి చేస్తోంది. ఆ వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు రూ.400 చొప్పున, ప్రైవేట్ కొనుగోలుదారులకు రూ.600 చొప్పున అమ్మనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. కేంద్రానికి కూడా రూ.400 కే అమ్ముతానని ఎస్‌ఐఐ అంటోంది. కేంద్రం మాత్రం రూ.150 అంటోంది. ఆ విషయం ఇంకా తేలలేదు. రూ.600 అంటే సుమారు 8 డాలర్లు. అదే రూ.400 అంటే 5.33 డాలర్లు (కరోనా రెండోసారి విజృంభించాక మన రూపాయి విలువ మరింత పడిపోయింది). ఆస్ట్రాజెనెకా ఇదే వ్యాక్సిన్ ని యూరోపియన్ యూనియన్ దేశాలకు 2.18 డాలర్లకు అమ్ముతోంది. అమెరికాకు 4 డాలర్లకు అమ్మాలని ప్లాను చేస్తోంది. మన ఎస్‌ఐఐ దక్షిణాఫ్రికాకు ఇదే వ్యాక్సిన్‌ను 5.25 డాలర్లకు ఎగుమతి చేస్తోంది. అంటే ఇక్కడ ఇండియాలో ఎస్‌ఐఐ నిర్ణయించిన కనీస ధర కన్నా తక్కువకే విదేశాలకు అమ్ముతోంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ చెల్లించనంత ఎక్కువ రేటు ఇక్కడ మనం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు చెల్లిస్తున్నాం.
ధరల్లో ఇన్ని రకాల తేడాలు ఉండడాన్ని ఎస్‌ఐఐ ఏవిధంగా సమర్ధించుకుంటోంది? సార్వత్రిక టీకా కార్యక్రమంలో వినియోగించేందుకు సరఫరా చేసే వ్యాక్సిన్ కు తక్కువ రేటు ఉంటుందని, అందుచేత ప్రైవేటు వినియోగదారుల నుండి ఎక్కువ రేటు వసూలు చేయాల్సి వస్తుందని ఆ సంస్థ చెప్తోంది. ఈ విధంగా ఎందుకు ఉండాలో దానిని మాత్రం స్పష్టం చేయడం లేదు. పోనీ వాళ్ళు చెప్పినదే ఒప్పుకుందాం. అటువంటప్పుడు ప్రభుత్వమే మొత్తం స్టాక్ అంతా కొనుగోలు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ప్రభుత్వం ద్వారానే పంపిణీ చేస్తే అందరికీ తక్కువ రేటుకే వ్యాక్సిన్ ను అందించవచ్చు కదా ? మరి మోడీ ప్రభుత్వం ప్రైవేటు అమ్మకాలకు ఎందుకు అనుమతిచ్చింది? (మరే ఇతర దేశంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్ వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయడానికి అనుమతి లేదు) . అంటే ప్రైవేటు అమ్మకాలకు అనుమతులివ్వడం ద్వారా మోడీ ప్రభుత్వమే వ్యాక్సిన్ ధరలను ఉత్పత్తిదారులు ఇష్టం వచ్చినట్టు పెంచుకుపోడానికి అవకాశం ఇచ్చిందని, వ్యాక్సిన్ ఉత్పత్తి ఖర్చుకూ, దాని ధరకూ ఎటువంటి సంబంధమూ లేదని అనుకోవాలి.
ఇప్పుడు ఏర్పడిన కరోనా సంక్షోభంలో అవసరమైన మేరకు వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడానికి అదనంగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవాలి. అందుకు కావలసిన అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలంటే ఇప్పుడు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌లను ఎక్కువ రేటు కు అమ్మాల్సి వుంటుంది. ఇది ఎస్‌ఐఐ ముందుకు తెచ్చిన మరొక వాదన. ఈ వాదనకు ఏ మాత్రమూ విలువ లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఐ కి అదనపు సామర్ధ్యం పెంచుకునే నిమిత్తం రూ.3000 కోట్లు ఇచ్చింది. కాబట్టి అదనపు ఆర్ధిక వనరుల కోసం వ్యాక్సిన్‌లను అధిక ధరలకు అమ్మవలసిన అవసరమే లేదు. పైగా మన దేశంలో వ్యాక్సిన్ ధరలు ఆ సంస్థ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న రేట్ల కన్నా ఎక్కువగా ఎందుకున్నాయో ఎస్‌ఐఐ చెప్పలేకపోతోంది. ఆ సంస్థ చేస్తున్న వాదనలన్నీ కరోనా మమమ్మారిని అడ్డం పెట్టుకుని చేస్తున్న దోపిడీకి కప్పిపుచ్చుకోడానికి చెప్తున్న కుంటిసాకులు మాత్రమే.
కోవ్యాక్సిన్ ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సామర్ధ్యంతో పోల్చితే ఎస్‌ఐఐ సామర్ధ్యం ఏ పాటికీ చాలదు. తాను ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌లో సగం కేంద్రానికి రూ.150 రేటుకు అందించడానికి భారత్ బయోటెక్ నిర్ణయించింది. ఇక తక్కిన సగం ఉత్పత్తిని రాష్ట్రాలకు రూ.600 చొప్పున, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1200 చొప్పున అమ్మడానికి రేట్లు నిర్ణయించింది. కేంద్రానికి అమ్మే రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా రాష్ట్రాలకు ఎందుకు అమ్మాల్సి వస్తోంది? ఆ వ్యాక్సిన్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆస్పత్రులతో పోటీ పడవలసిన పరిస్థితి ఎందుకుంది? ఈ విషయాలు ఎవరికీ అర్ధం కాని ఒక రహస్యంలా ఉన్నాయి. కేంద్రానికి సబ్సిడీ ఇచ్చి అమ్ముతున్నందున తక్కిన వారికి ఆ మేరకు అధికంగా రేటు నిర్ణయించారనుకుంటే అందులో అర్ధం లేదు. ఎందుకంటే కేంద్రం మాత్రమే కాక, రాష్ట్రాలు కూడా అదే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అటువంటప్పుడు ఒక్క కేంద్రానికే సబ్సిడీ ఇచ్చి రాష్ట్రాలకు ఇవ్వకపోవడం ఏమిటి ? పైగా కోవిషీల్డ్ రేట్లకన్నా కోవ్యాక్సిన్ రేట్లు చాలా ఎక్కువగా ఎందుకున్నాయి ?
ఈ ప్రశ్నలకు చెప్తున్న సమాధానాలు బొత్తిగా అర్ధం, పర్ధం లేకుండా ఉన్నాయి. ఎస్‌ఐఐ వ్యాక్సిన్ పరిశోధనలకోసం ఎటువంటి ఖర్చూ చేయలేదట కాని బిబి (భారత్ బయోటెక్) రూ.350 కోట్లు ఖర్చు చేసింది కనుక ఆ ఖర్చును తిరిగి రాబట్టుకోవాలంటే ఎక్కువ ధర నిర్ణయించాలట ! కాని ఇది పూర్తిగా అవాస్తవం. దీనికి సంబంధించి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన రామ్‌కుమార్ వివరంగా రాశారు (ఏప్రిల్ 26, ది స్క్రోల్). కోవ్యాక్సిన్ ను పరిశోధించడం కోసం ప్రజాధనం గణనీయమైన మొత్తం ఖర్చు చేయడం జరిగిందని, ఈ వాస్తవం గురించి ప్రధాన పత్రికలు అన్నీ కోవ్యాక్సిన్ గురించి సమీక్షించినప్పుడు ధృవపరిచాయని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్) చైర్మన్ స్వయంగా ఈ పత్రాల సహ రచయితగా ఉన్నారని రామ్‌కుమార్ వ్యాసం తెలియజేస్తోంది.
అయినాసరే, బిబి చేస్తున్న వాదనను మాటవరసకు ఒప్పుకుందాం. బిబి తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏడాదికి 70 కోట్ల వ్యాక్సిన్ డోసులకు రానున్న కాలంలో పెంచనుంది. ఇప్పుడు మాత్రం రాబోయే ఒక్క నెలలో 3 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనుంది. అందులో సగం కేంద్రానికి పోతే, పావు వంతు రాష్ట్రాలకు, తక్కిన పావు వంతు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్మబోతున్నదని అనుకుందాం. అప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు 75 లక్షల డోసులు అందుతాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కోవిషీల్డ్ రూ.600 చొప్పున ఇస్తోంది. అదే కోవ్యాక్సిన్ రూ.1200 కి అమ్మడానికి నిర్ణయించింది. తేడా రూ.600. 75 లక్షల డోసులకి అదనంగా రూ.450 కోట్లు వస్తుంది. బిబి కి తను పరిశోధనలకోసం చేశానంటున్న ఖర్చు రూ.350 కోట్లు కేవలం 23 రోజుల అమ్మకాలతోటే వచ్చేస్తుంది! అటువంటప్పుడు ఎస్‌ఐఐ కన్నా రెట్టింపు ధరను ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో పెర్మనెంటుగా ఎందుకు నిర్ణయించారు ?
బిబి ఇంకో వాదన చేస్తోంది. ఎస్‌ఐఐ కి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 30 కోట్ల డాలర్ల విరాళం అందిందని, తనకు అటువంటిదేదీ అందలేదని చెప్తోంది. అందువలన తన పెట్టుబడి ఖర్చు ఎస్‌ఐఐ కన్నా ఎక్కువైందని, దానిని తిరిగి రాబట్టుకోడానికే ఎక్కువగా ధరను నిర్ణయించాల్సి వచ్చిందని అంటోంది (కోవిషీల్డ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి రూ.150 చొప్పున అమ్మితే) కోవిషీల్డ్ సగటు ధర రు.325 అవుతోంది. అదే కోవ్యాక్సిన్ సగటు ధర రూ.525 అవుతోంది. తేడా రూ.200. కోవిషీల్డ్ కు అందిన విరాళం తో సమానమైన మొత్తం (ప్రస్తుతం బిబి ఉత్పత్తి చేస్తున్న స్థాయిలోనే, నెలకు 3 కోట్ల డోసుల ఉత్పత్తినే కొనసాగించినప్పటికీ) నాలుగు నెలలలోపునే బిబి కి సమకూరిపోతుంది. అటువంటప్పుడు పెర్మనెంటుగా ఎక్కువ రేటు నిర్ణయించడం ఏ విధంగా సమంజసం అవుతుంది ? ఇది దారుణమైన దారిదోపిడీ కాదా ?
ఎస్‌ఐఐ గాని, బిబి గాని తాము వసూలు చేస్తున్న అధిక ధరలను సమర్ధించుకోడానికి చేస్తున్న వాదనలేవీ ఏమాత్రమూ సబబుగా లేవు. కరోనా వైరస్ నిరంతరం మ్యుటేట్ అయిపోతూ వుంటుందని (పరివర్తన చెందడం) అందుచేత దానికి తగినట్టు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకోవలసి వుంటుందని, అందుకోసమే ధర అధికంగా నిర్ణయించామని చెప్తున్నారు. ఇలా అభివృద్ధి చేసుకోడానికి ఎంత మొత్తాన్ని కేటాయించి పక్కన పెట్టిందీ ఆ విషయం మాత్రం చెప్పడం లేదు. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి అదనపు పెట్టుబడి అవసరం ఉందని చెప్తున్నారు కాని అందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సహాయం గురించి నోరు విప్పడం లేదు (ఎస్‌ఐఐ కి కేంద్రం రూ.3000 కోట్లు ఇచ్చినట్టే బిబి కి కూడా రూ.1500 కోట్లు ఇచ్చింది). అంటే ఈ ఇద్దరు ఉత్పత్తిదారులూ ఇప్పుడు నెలకొన్న సంకట స్థితిని తమకు లాభదాయకంగా మలచుకోడానికి మాత్రమే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ వాస్తవం తెలియలేదంటే అది దాని చేతకాని తనం ఔతుంది. తెలుసునంటే ఈ అవినీతి కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అయినట్టు అనుకోవలసి వుంటుంది. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరగడం అవసరం.
నిజానిజాలు నిగ్గుదేలాలంటే ప్రభుత్వం దిగువన చెప్పే నాలుగు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటైనా అమలు చేయాలి. బాగా తెగువ ఉన్న ప్రభుత్వమే అయితే మొదటి ప్రత్యామ్నాయాన్ని అమలు చేయాలి. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని జాతీయం చేయడమే మొదటి ప్రత్యామ్నాయం. దానివలన అన్ని సమస్యలూ పరిష్కారం అయిపోతాయి.
అంత ధైర్యం ఈ ప్రభుత్వానికి లేకపోతే ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కే వరకైనా ఎస్‌ఐఐ ని, బిబి ని తాత్కాలికంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ తర్వాత తిరిగి వెనక్కి అప్పజెప్పవచ్చు (స్పెయిన్ వంటి దేశాలు అదేవిధంగా ప్రైవేటు ఆస్పత్రులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాయి). ఆ విధంగానైనా చేసే ధైర్యం లేకపోతే కనీసం వ్యాక్సిన్ ధరలను నిర్ణయించే విషయంలో ఒక కమిషన్ ను నియమించి ఉత్పత్తికి అయిన ఖర్చెంతో, ప్రభుత్వం ఎంత రేటు చెల్లించాలో తేల్చాలి (వ్యవసాయోత్పత్తుల ఖర్చులను, ధరలను నిర్ణయించడానికి కమిషన్ వేసిన విధంగానే). ఒకే ఒక కొనుగోలుదారుడిగా ప్రభుత్వం ఉండే విధానం ఎందుకు అమలు చేయకూడదో అది కూడా ఆ కమిషన్ నిర్ధారించవచ్చు.
అది కూడా చేసే ధైర్యం లేకపోతే కనీసం ఈ ఇద్దరు ఉత్పత్తిదారుల గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టడానికైనా పూనుకోవాలి. కొత్త ఉత్పత్తిదారులను ఆహ్వానిస్తూ ఎవరు అతి తక్కువ ధరకు అందించడానికి ముందుకు వస్తారో వారికే ఉత్పత్తి చేసే లైసెన్సు మంజూరు చేయాలి.
(స్వేచ్ఛానుసరణ)
@ప్రజాశక్తి దినపత్రిక నుండి సేకరణ
No comments:
Post a Comment