May 24 2021 @ 18:06PM
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా? చైనాలో తొలి కేసు 2019 నవంబర్‌లోనే నమోదైందా? వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలే తొలుత కరోనా బారిన పడ్డారా? అవుననే అంటోంది అమెరికాకు చెందిన ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదిక ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఈ కథనంలో ఏముందంటే..
`2019 డిసెంబర్ 8న చైనాలోని వుహాన్‌లో `సార్స్ కోవ్-2` తొలి కేసు నమోదైనట్టు అధికారిక సమాచారం. అయితే బాహ్య ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చే ముందే వుహాన్ ల్యాబ్‌లోని ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలోనూ జ్వరం, పొడి దగ్గు, ఆయాసం వంటి కోవిడ్-19 లేదా ఫ్లూ లక్షణాలు కనిపించాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆ విషయాన్ని చైనా బయటకు పొక్కనివ్వలేదు. చాలా గోప్యంగా ఉంచింది. ఆస్పత్రి చుట్టూ, ల్యాబ్ చుట్టూ పటిష్టమైన కాపలా పెట్టింది. 2019 నవంబర్‌లోనే వుహాన్‌లో కరోనా వ్యాపించినట్టు నమ్మకమైన మిత్రుల ద్వారా సమాచారం అందింది. డిసెంబర్ నాటికి కరోనా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ సృష్టే అనే అనుమానాన్ని బలపరుస్తున్నాయ`ని అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది.
చైనా ఏమంటోంది..
చైనా ఈ కథనాన్ని ఖండించింది. కరోనా పుట్టుక విషయంలో ప్రపంచాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికనే సమాధానంగా చెబుతోంది. కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లోని ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్ అందజేసిన సంగతి తెలిసిందే. కాగా, తమ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ కాలేదని, తమ ల్యాబ్ సభ్యులెవరికీ కరోనా యాంటీ బాడీలు లేవని బ్యాట్ ఉమెన్ షిఝెంగ్ లీ.. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందంతో చెప్పిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment