Sunday, June 13, 2021

COVID Treatment Changed

 Jun 14 2021 @ 03:40AMహోంతెలంగాణ

కొవిడ్‌కు ట్రీట్‌మెంట్‌ మారింది!

కొవిడ్‌కు మారిన చికిత్స సరళి

లక్షణాలున్న తొలి వారంలోనే రెమ్‌డెసివిర్‌ 

10 రోజుల తర్వాతే పరిమితంగా స్టెరాయిడ్స్‌ 

పారాసెటమాల్‌, ఆస్తమా మందులు, 2డీజీ,

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స

ప్రస్తుతం కరోనాకు వాడుతున్నవి ఇవే..

గత ఏడాదిగా వాడిన పలు ఔషధాలను

ప్రొటోకాల్‌ నుంచి తొలగించిన ప్రభుత్వం

హెచ్‌సీక్యూఎస్‌, ప్లాస్మాచికిత్స, ఫావిపిరవిర్‌,

ఐవర్‌మెక్టిన్‌, యాంటీబయాటిక్‌లు ఔట్‌!


(హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి): గుర్తుందా? ఏడాది క్రితం ఇదే సమయంలో.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నవేళ.. ఆ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే దివ్యౌషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూఎ్‌స) అని తెగ ప్రచారం చేశారు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే.. మనదేశం నుంచి ఆ మందు ఎగుమతుల విషయంలో బెదిరింపులకు సైతం దిగారు! ఆ తర్వాత నాలుగు నెలలు కూడా గడవకముందే.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా చికిత్స ప్రొటోకాల్‌ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించింది. అలాగే ఐవర్‌ మెక్టిన్‌. మనదేశంలో కరోనా చికిత్స ప్రొటోకాల్‌లో చాలా ఎక్కువగా వాడిన మందు ఇది. సరిగ్గా నెలరోజుల క్రితం.. ‘అబ్బే, కరోనా చికిత్సకు ఐవర్‌ మెక్టిన్‌ పనిచేస్తుందన్న ఆధారాల్లేవు, వాడొద్దు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తుస్సుమనిపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఈ రెండు మందులనూ ప్రొటోకాల్‌ నుంచి తీసేసింది. వీటితోపాటు ఫావిపిరవిర్‌ను కూడా తొలగించేసింది. ఇక.. కరోనాపై పోరులో తిరుగులేని బ్రహ్మాస్త్రంగా ప్రచారం పొందిన రెమ్‌డెసివిర్‌నైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది నవంబరులోనే చికిత్స ప్రొటోకాల్‌ నుంచి తొలగించింది. మనదేశంలో ప్రస్తుతం ఆఫ్‌లేబుల్‌ యూజ్‌/అత్యవసర వినియోగం కింద వాడుతున్నా.. త్వరలోనే దీన్ని ప్రొటోకాల్‌ నుంచి తొలగించే దిశగా ఐసీఎంఆర్‌ ఆలోచిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రెమ్‌డెసివిర్‌ను పరిమితంగానే వినియోగించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడుతోంది. ఇక.. ఒకదశలో విచ్చలవిడిగా వాడిన స్టెరాయిడ్లను మొదటివారంలో అసలు వాడనేవద్దంటూ మే 26న కేంద్ర ఆరోగ్య శాఖ సవరించిన కొవిడ్‌ క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌లో పేర్కొంది. ప్లాస్మా థెరపీని కూడా ప్రొటోకాల్‌ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. యాంటీ బయాటిక్స్‌ను కూడా వినియోగించొద్దని పలువరు వైద్యులు చెబుతున్నారు. 




వీటన్నింటి సారాంశం ఏంటంటే.. హెచ్‌సీక్యూఎ్‌స, ఐవర్‌మెక్టిన్‌, స్టెరాయిడ్స్‌, రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా థెరపీ, యాంటీ బయాటిక్స్‌.. ఇలా దేన్నీ వాడకూడదు. మరి కరోనా చికిత్సలో మిగిలిన ఔషధాలేంటి? కరోనా రోగులకు ఏం వాడాలి? ఏం వాడుతున్నారు? అంటే.. వైరస్‌ సోకిన తర్వాత పేషెంట్లు ఏ దశలో ఉన్నారు, వారికి ఏయే లక్షణాలున్నాయి అనే అంశాల ఆధారంగా చికిత్స చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.  కొందరు వైద్యులు.. పారాసెటమాల్‌ తప్ప ఐవర్‌మెక్టిన్‌, యాంటీబయాటిక్‌ మందులను అస్సలు సిఫారసు చేయట్లేదు. వైరస్‌ సోకినవారిలో స్వల్పలక్షణాలున్న అత్యధికులకు.. వారి శరీరంలోని రోగనిరోధక శక్తే వైరస్‌ను ఎదుర్కొంటోందని వారు చెబుతున్నారు. ఇక మిగిలింది.. తీవ్ర లక్షణాలున్నవారు, శ్వాస ఆడకని పరిస్థితి ఉన్నవారు, పరిస్థితి విషమించినవారు.  



అందుకే ఇలా..


కరోనా మహమ్మారి ప్రబలిన తొలినాళ్లలో.. అది ఎంత తీవ్రం? ఏ ఔషధానికి లొంగుతుంది? తదితర సందేహాలకు సంబంధించిన సమాధానాలేవీ అంత తేలిగ్గా లభించలేదు. అందుకే రకరకాల మందులను ప్రయోగించారు. తర్వాత.. ప్రయోజనాల కన్నా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్న ఔషధాలను తొలగిస్తూ వచ్చారు. కరోనా తీరుతెన్నులు అర్థమయ్యాక చికిత్సా విధానంలో చాలా మార్పులు వచ్చాయి.  స్టెరాయిడ్లను మొదటివారంలో వీలైనంత వరకూ వాడట్లేదు. కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం పరిమిత మందులతోనే చికిత్సలు అందిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ను గతంలో శ్వాస ఆడని స్థితిలో ఉన్నవారికి వాడేవారు. ఇప్పుడు లక్షణాలు కనపడ్డ ఏడు నుంచి తొమ్మిది రోజుల్లోపు ఇస్తున్నారు. కొందరికి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధాన్ని, ఔట్‌ పేషెంట్లకు ప్రయోగాత్మకంగా మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న కరోనా చికిత్స ప్రొటోకాల్‌ మెరుగైనదని, రోగుల ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తోందని అపోలో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీత నర్రారెడ్డి పేర్కొన్నారు. కొందరు వైద్యులు మాత్రం.. మెడిసిన్‌ డోసులను తగ్గించడం వల్ల వైర్‌సను నియంత్రించడం కష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 




కరోనా చికిత్స సరళి మారింది. హెచ్‌సీక్యూస్‌, ప్లాస్మా చికిత్స, ఫావిపిరవిర్‌, ఐవర్‌ మెక్టిన్‌.. ఇలా చాలా వాటిని కొవిడ్‌ చికిత్స ప్రొటోకాల్‌ నుంచి తొలగించారు! పారాసెటమాల్‌, అవసరమైతే ఆస్తమా మందులు, కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 7-9 రోజుల్లోపు రెమ్‌డెసివిర్‌, లక్షణాలు తీవ్రమై,  శ్వాస ఆడని పరిస్థితుల్లో.. అది కూడా రెండోవారంలో, పరిమితంగా స్టెరాయిడ్లు. ఇవే ఇప్పుడు కరోనాకు వాడుతున్న మందులు. డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ కూడా వాడుతున్నారు. గేమ్‌ చేంజర్‌గా చెబుతున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స కూడా మనదగ్గర కొన్ని ఆస్పత్రుల్లో చేస్తున్నారు. ఔట్‌ పేషెంట్‌ చికిత్స పొందేవారికి ప్రయోగాత్మకంగా నెలన్నరగా మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని కూడా ఇస్తున్నారు.




మొదటి వారం స్టెరాయిడ్లు ఇవ్వట్లేదు


కరోనా సోకినవారు మా వద్దకు వచ్చినప్పుడు లక్షణాల ఆధారంగా సమస్య ఏ దశలో ఉందో గుర్తించి ఆ మేరకు మందులు ఇస్తున్నాం. స్టెరాయిడ్లు ఇప్పుడు మొదటివారంలో ఇవ్వట్లేదు. ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతున్నప్పుడు మాత్రమే ఇస్తున్నాం. హెచ్‌సీక్యూ అస్సలు ఇవ్వట్లేదు. అవసరాన్ని బట్టి రెమ్‌డెసివిర్‌ను.. లక్షణాలు కనిపించిన మొదటి వారంలో వచ్చిన రోగులకు మాత్రమే ఇస్తున్నాం.   


- డాక్టర్‌ జగదీష్ కుమార్‌, జనరల్‌ ఫిజిషియన్‌, ఎఐజీ




మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌.. గేమ్‌ చేంజర్‌


కొవిడ్‌కు నిర్ణీత మందులేవీ లేవు. లక్షణాలను బట్టి.. ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌, పరిమితంగా రెమ్‌డెసివిర్‌, అస్తమాటిక్‌ మందులను సిఫారసు చేస్తున్నాం. మొదటి వారంలో వచ్చిన వారికి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ చికిత్స చేస్తున్నాం. సీఆర్‌పీ 75కన్నా ఎక్కువగా ఉండి, ఆక్సిజన్‌ పెట్టినా పరిస్థితి మెరుగుపడకపోతే టోసిలిజమాబ్‌ ఇస్తున్నాం.    


    - డాక్టర్‌ విజయ్‌కుమార్‌, పల్మానాలజిస్టు, అపోలో ఆస్పత్రి

No comments:

Post a Comment