ఈ గోల మనకేల! వ్యాక్సిన్ బాధ్యత కేంద్రానికే వదిలేద్దాం!
Jun 4 2021
ముఖ్యమంత్రులకు జగన్ లేఖ
స్వీయ అనుభవంతో చెబుతున్నా!
ఈ నెలన్నరలో సవాళ్లు తెలిసొచ్చాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేదు
‘కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు’గా పరిస్థితి
ఆమోదించే అధికారం కేంద్రానిదే!
టీకాపై రాష్ట్రాలకు కీలక పాత్ర సరికాదు
‘కేంద్రీకృతం’తోనే అద్భుత ఫలితాలు
ఈ ఏడాది మొదట్లో చేసినట్లుగా కేంద్రమే మొత్తం బాధ్యత తీసుకోవాలి
ఈ విషయంలో ఒకే స్వరం వినిపిద్దాం
ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం పిలుపు
అమరావతి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యాక్సిన్ విషయంలో ముఖ్యమంత్రులమంతా ఒకేమాట వినిపిద్దాం! వ్యాక్సిన్ పంపిణీలో మనకు ముఖ్య పాత్ర వద్దు! ఈ బాధ్యతను పూర్తిగా కేంద్రానికే వదిలేద్దాం’’.... ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు! ‘గ్లోబల్ టెండర్ల’ పేరిట హడావుడి చేసి, చివరికి ఎలాంటి స్పందనా రాని నేపథ్యంలో జగన్ గురువారం ఈ మేరకు లేఖలు రాశారు. ‘నా అనుభవంతో చెబుతున్నాను! వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీ చెయ్యలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. విషయం కేంద్రానికే వదిలేద్దాం’ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పలురాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినప్పటికీ... కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ మాత్రం బయటికి వచ్చింది.
‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ... మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ జగన్ తన లేఖను మొదలుపెట్టారు. కరోనాపై పోరులో ప్రధానమైన అస్త్రం వ్యాక్సిన్ మాత్రమే అని తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ‘‘మాకు ఎదురైన వాస్తవిక అనుభవం నుంచి ఈ లేఖను రాస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో... గ్లోబల్ టెండర్లకు వెళ్లాం. గురువారం (జూన్ 3) సాయంత్రానికి గడువు ముగిసినప్పటికీ... ఒక్క కంపెనీ కూడా వ్యాక్సిన్ సరఫరాకు ముందుకు రాకపోవడం నన్ను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం పరిస్థితి రాష్ట్రాలు వర్సెస్ కేంద్రంగా మారడం, అంతిమంగా బిడ్స్‌ను ఆమోదించాల్సింది కేంద్రమే కావడం దీనికి కారణాలుగా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే... వ్యాక్సిన్ సేకరణ విషయంలో రాష్ట్రాలుగా మన చేతిలో ఏమీ లేదని చెప్పవచ్చు. సమన్వయ సమస్యలతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే... తమకు తగినంత వ్యాక్సిన్ సరఫరా కావడంలేదని, గ్లోబల్ టెండర్లకు కూడా స్పందన లభించడంలేదని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో.. వ్యాక్సినేషన్‌లో ఎలాంటి జాప్యం జరిగినా మనమంతా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని జగన్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రానికే వదిలేద్దాం...
వ్యాక్సిన్ సరఫరా విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఒకే మాటమీద ఉండాలని జగన్ అభ్యర్థించారు. ‘‘వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రానికే వదిలేద్దాం. ఈ ఏడాది తొలి మొదట్లో చేసినట్లుగానే... కేంద్రమే వ్యాక్సిన్ బాధ్యతను తీసుకోవాలని కోరదాం. అప్పుడు సరైన సమయంలో వైద్య సిబ్బందికి టీకాలు వేయడంతో మంచి ఫలితాలు లభించాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు సరైన సమయంలో టీకాలు వేయగలిగాం. ఈ నిర్ణయం వల్లే... వారంతా సెకండ్ వేవ్‌లో కరోనాతో గట్టిగా పోరాగడలిగారు’’ అని వివరించారు. మరోవైపు... వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియలోనూ పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.... వ్యాక్సిన్ సమీకరణలో రాష్ట్రాలకు పెద్ద పాత్ర ఇవ్వాలనే నిర్ణయం ఎంతమాత్రం వాంఛనీయం కాదని తెలిపారు. ‘‘వ్యాక్సిన్ సమీకరణ కోసం నెలన్నర పాటు ప్రయత్నించాం. ఈ క్రమంలోనే ఇందులో ఉన్న సవాళ్లు స్వయంగా మా అనుభవంలోకి వచ్చాయి’’ అని జగన్ వివరించారు. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటును పెంచడమే ముఖ్యమని... అది ఎక్కడిది, ఎవరు సేకరించారన్నది ముఖ్యం కాదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల మద్దతు, సమన్వయంతో ‘కేంద్రీకృత’ వ్యాక్సినేషన్ జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. ఇందుకు అందరూ మద్దతు పలకాలని, కరోనాపై దేశం విజయం సాధించేందుకు ముఖ్యమంత్రులంతా ఒకే స్వరం వినిపించాలని జగన్ పిలుపునిచ్చారు.
కేంద్రాన్ని నొప్పించకుండా...వారు చెప్పిందే... మరోలా!
వ్యాక్సినేషన్‌లో ఉన్న సమస్యలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడో గ్రహించారు. దీనిపై దాదాపు నెల క్రితం ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కొన్నాళ్ల కిందట కేరళ సీఎం పినరయి విజయన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకొంటోందని, రాష్ట్రాలకు అవసరమయ్యే వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని... దీనిపై ముఖ్యమంత్రులంతా కలిసి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని పినరయి విజయన్ గత నెలలో ఎన్డీయేకు చెందని 11 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆయన జగన్‌కు కూడా లేఖను పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేయాలనడం ఎంత మాత్రం సరికాదని అందులో తెలిపారు. ఇప్పుడు... జగన్ కేంద్రానికి ఏమాత్రం నొప్పి కలగకుండా, ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్ కూడా చేయకుండా, ‘టీకా కార్యక్రమాన్ని కేంద్రానికే వదిలేద్దాం’ అంటూ సీఎంలకు లేఖ రాయడంలో అంతరార్థమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment