Friday, July 2, 2021

Encouraging private sector in Medical and Health

 ప్రయి'వేటు' ప్యాకేజి 


Wed 30 Jun 22:59:50.310319 2021


కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ 19 ప్రభావిత రంగాల ఉద్ధరణ కోసం మరో దఫా ఆర్థిక ప్యాకేజి ప్రకటించింది. ఆర్థిక మంత్రి మాటల్లో ఈ ప్యాకేజీ విలువ 6,29,000 కోట్ల రూపాయలు. ఇందులో రుణహామీ పద్దు కింద 1,10,000 కోట్లు, అత్యవసర రుణహామీ పద్ద్దు కింద 150000 కోట్లు, విద్యుత్‌ డిస్కంల నష్టాలు పూడ్చేందుకు 93631 కోట్లు, ఆహార భద్రత పద్దు కింద 93869 కోట్లు, ఎగమతుల బీమా కోసం 88000 కోట్లు, ప్రాజెక్టు ఉత్పత్తుల ఎగుమతి కోసం 33000 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద 14775 కోట్లు, ఆరోగ్యబీమా పథకం కింద 15000 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బాండ్‌ సేవల విస్తరణ కోసం 19041 కోట్లు, సూక్ష్మరుణ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం హామీ ఉండేందుకు 7500 కోట్లు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉచిత వీసా పథకానికి వంద కోట్లు, ఈశాన్య భారత వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కోసం 77 కోట్లు వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

      కోవిడ్‌ రెండో ఉప్పెన ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించంలో ఈ ప్యాకేజి కీలక పాత్ర పోషిస్తుందన్నది అమాత్యుల సందేశం. పై పద్దులు మరింత లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క ఆహార భద్రత పథకం కింద వెచ్చించే 93869 కోట్లు మినహా నేరుగా ప్రజలకు లబ్ది కలిగే ఖర్చు ఒక్కటీ లేదు.



       గత సంవత్సరం ఆహార భద్రత పథకం కింద దాదాపు ఏడాదిపొడవునా కుటుంబానికి నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేసినందుకు గాను సుమారు ఐదున్నర లక్షల కోట్లు ఖర్చయినట్టు కేంద్రం 2021-22 బడ్జెట్‌లో వెల్లడించింది. ఈ సంవత్సరం మే నుంచి నవంబరు వరకూ ఈ పథకాన్ని కొనసాగించనున్నట్లు ప్రధాని రెండు వారాల క్రితం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. అంటే సుమారు ఎనిమిది నెల్లపాటు దేశవ్యాప్తంగా పోయిన ఏడాది తరహాలోనే ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు సుమారు లక్ష కోట్లు ఖర్చుచేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆర్థిక మంత్రి జూన్‌ 28 నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించిన లెక్కలే వాస్తవమైతే ఎనిమిది నెల్ల కాలానికి లక్ష కోట్లు ఉచిత ఆహార సరఫరాకు ఖర్చయ్యే అంచనా ప్రకారం 12నెలలకు మహా అయితే మరో 50 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. ఈ అంచనా ప్రకారం పరిశీలిస్తే గత ఏడాది ఉచిత ఆహారధాన్యాల సరఫరా కోసం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామన్న బడ్జెట్‌ లెక్కలు తప్పుడు లెక్కలేనని భావించాలి. అలాకాకుండా ఇప్పుడు చెప్పిన బడ్జెట్‌ లెక్కలే సరైనవని భావించే పక్షంలో ఈ ఏడాది ఈ పథకం ద్వారా లబ్దిపొందే అర్హుల సంఖ్యలో దాదాపు 60శాతానికి పైగా కోత విధిస్తే తప్ప ఈ మొత్తంతో ఆహారధాన్యాలు సరపఫరా చేయటం సాధ్యం కాదు.



ప్యాకేజీలో దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు వివిధ పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు మాత్రమే. ఈ రుణాలకు ప్రభుత్వం తరపున గ్యారంటీ ఉంటామన్నది ఈ పాకేజి సారాంశం. సూక్ష్మ రుణ సంస్థలు బ్యాంకుల వద్ద తీసుకునే రుణాలకు కూడా ప్రభుత్వం హామీ ఉంటామని ప్రకటించింది. అంటే బ్యాంకు వద్ద రుణం తీసుకుని ఈ సంస్థలు చెల్లించలేకపోతే ఆయా బ్యాంకులకు ప్రభుత్వమే జమ చేయాల్సి ఉంటుంది. దీని కోసం జాతీయ రుణ హామీ ట్రస్టీ కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు సహాయం చేయదల్చుకుంటే ఇప్పటి వరకూ వడ్డీ రేట్లు తగ్గించే విధానమే అమల్లో ఉంది తప్ప ఈ విధంగా తీసుకున్న అప్పుకు వకాల్తా పుచ్చుకుని హామీగా నిలిచిన సందర్భాలు లేవు. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న పారుబకాయిల పద్ధతికి ప్రభుత్వం కొత్త నిర్వచనం చెప్తున్నట్టుగా ఉంది. ఈ పద్ధతి అమెరికాలో సబ్‌ ప్రైమ్‌ సంక్షోభానికి దారి తీసిన విధాన నిర్ణయాలను గుర్తు చేస్తోంది.

       ఇక్కడ ఖర్చవుద్దో లేదో తెలీని పద్దులు కూడా ఈ ప్యాకేజిలో ప్రకటించటం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకతగా కనిపిస్తుంది. అటువంటి వాటిలో ఒకటి అంతర్జాతీయంగా ఎగుమతి చేసే కంపెనీలకు ఇన్సూరెన్స్‌ చెల్లించేందుకు 88 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటికే వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ రకాల ఎగుమతి ప్రోత్సహకాలు అమలు జరుగుతున్నాయి. అవే కంపెనీలు ఎగుమతి చేసే ఉత్పత్తుల ప్రమాదబీమాకు కూడా ప్రభుత్వమే భరోసాగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ పథకం వలన అదనంగా ఎగుమతిదారులు తెరమీదకు రావచ్చేమో కానీ అదనంగా ఉపాధి కల్పించే వస్తూత్పత్తి రంగానికి కలిగే ప్రయోజనం దాదాపు ఉండదనే చెప్పాలి.



      మరో కీలకమైన పద్దు ఎరువుల సబ్సిడీ. బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే అదనంగా సుమారు 15వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎరువుల సబ్సిడీ వలన రైతాంగానికి మేలు జరుగుతుందా లేక ఎరువులు, పురుగుమందులు తయారు చేసే కంపెనీలకు మేలు జరుగుతుందా అన్న బ్రహ్మముడి అలానే మిగిలి ఉంది. రైతుల పేరు మీద ఏటా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్‌ పత్రాల్లో కనిపిస్తున్నా వ్యవసాయం దివాళా తీయటం, కూలీలు ఉపాధి కోల్పోవటం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవటం మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్చ ఒక ఎత్తు. ఇప్పుడున్న అంశం మరో ఎత్తు. అదనంగా వెచ్చించబోయే సబ్సిడీ కింద ఖర్చుచేసే సొమ్ము ఇప్పుడున్న సబ్సిడీ మోతాదు పెంచటం ద్వారా ఖర్చు చేస్తారా లేక దేశంలో వ్యవసాయం చేసే విస్తీర్ణం పెరుగింది కాబట్టి అదనంగా ఎరువులు పురుగుమందులు వినియోగం పెరగనున్న దృష్ట్యా ఈ పద్దు కింద ఖర్చు పెంచారా అన్నది ఆర్థిక మంత్రి మాటల్లో కానీ, ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో కానీ స్పష్టత లేదు. ఇక్కడ ఓ హెచ్చరికను గుర్తు పెట్టుకోవాలి. గత సంవత్సరం బలవంతంగా ఆమోదించిన రైతు చట్టాలతో వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్‌ శక్తుల ప్రవేశానికి తలుపులు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గోదాముల నిర్మాణం జరుగుతోంది. లక్షల ఎకరాలు కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ సాగుకిందకు మళ్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న వ్యవసాయక సబ్సిడీల ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పాలి. రైతు సబ్సిడీ పేరుతో జరుగుతున్న కపటనాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.

       ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీలో మరో కీలకమైన పద్దు విద్యుత్‌ రంగానికి సంబంధించిన పద్దు. ఈ పద్దు కింద 93631 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ఈ మొత్తాన్ని విద్యుత్‌ పంపిణీ రంగంలో ఉన్న కంపెనీల నష్టాలు పూడ్చటానికి ఖర్చుపెట్టనున్నారు. అది కూడా ఓ షరతు మీదమాత్రమే. ఈ ప్యాకేజి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ ప్రయివేటీకరణలో ఉన్న చివరి దశ సంస్కరణలు కూడా అమలు చేయాలన్న షరతు అంగీకరించి అమలు చేస్తేనే ఈ నిధులు రాష్ట్రాలకు అందుతాయి. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రయివేటీకరించబడింది. పంపిణీ రంగాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నా నిర్వహిస్తున్న తీరు మాత్రం దాదాపు ప్రయివేటు వ్యవహారంలాగానే మార్చేశారు. వినియోగదారుల హక్కుల మొదలు ఉద్యోగుల హక్కుల వరకూ దేనికీ గ్యారంటీ లేని దుస్థితి కళ్లముందున్నది. ఎప్పుడు ఎందుకు ఏ సర్‌చార్జి పెరుగుతుందో తెలీని అయోమయస్థితిలో విద్యుత్‌ వినియోగదారులున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్యాకేజీ కారణంగా ఈ కొద్దిపాటి తెర కూడా తొలగించిన విద్యుత్‌ పంపిణీ రంగాన్ని జిల్లాల వారీగా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ప్రయివేటురంగానికి అమ్మేయాలన్న షరతు రాష్ట్ర విద్యుత్‌ రంగాలపై కత్తిలా వేళాడనుంది. కేరళ వంటి ప్రభుత్వాలు ఈ షరతును అంగీకరించకపోతే కేంద్రం నుండి రావల్సిన నిధులు నిలిచిపోతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి గురవుతుంది. పౌరసేవలకు అంతరాయం కలుగుతుంది. గత దశాబ్దానికి పైగా విద్యుత్‌ రంగంలో అమలు జరుగుతున్న సంస్కరణలు ఈ విచ్ఛినకర విషయవలయం చుట్టూనే తిరుగుతున్నాయి. తాజా ప్యాకేజితో ఈ విషవలయాన్ని గుక్కతిప్పుకోలేనంత వేగంగా అమలులోకి తేవడానికి కేంద్రం సిద్ధమైంది.



      చివరిగా వైద్యరంగానికి సంబంధించిన కేటాయింపులు. సార్వత్రిక ఉచిత టీకా కార్యక్రమానికి కావల్సిన నిధులు కేటాయించటానికి బదులు కేంద్రం ప్రయివేటు కార్పొరేట్‌ ఆసుపత్రులు తీసుకునే బ్యాంకు రుణాల నిమిత్తం 55వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇంతకన్నా దుర్మార్గమైన విధానం ఏముంటుంది? కోవిడ్‌ రెండో ఉప్పెన ప్రభుత్వ వైద్యసేవల ప్రాధాన్యతను మరోసారి దేశం ముందు చర్చకు పెట్టింది. గత ఏడాది కంటే ఈ సారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌ చికిత్సలు పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాల విస్తరణ కోసం నిధులు వెచ్చించాల్సిన కేంద్రం, ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్‌ వైద్య రంగాన్ని విస్తరింపచేసేందుకు ఖర్చుచేయబూనుకోవటం అమానుషం. తాజా ప్యాకేజీ లోతులు పరిశీలించినప్పుడు కోవిడ్‌ సహాయ పథకాల పేరుతో పెండింగ్‌లో ఉన్న ప్రయివేటీకరణ సంస్కరణలను పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం నడుం కట్టిందన్నది స్ఫష్టమవుతోంది.

- కొండూరి వీరయ్య

సెల్‌: 9871794037

నవ తెలంగాణ దిన పత్రిక నుండి సేకరణ

No comments:

Post a Comment