Friday, July 2, 2021

All blames t the doctors

 పాపాలన్నీ వైద్యుల మీదకే తోసేద్దామా!


వైద్యవిద్యపై ప్రభుత్వాలు ఎప్పుడైతే నిర్లక్ష్యం వహించాయో, అప్పుడే ప్రైవేటు వైద్యవిద్యాసంస్థల నిర్వాహకులు తమ దోపిడీని నిర్లజ్జగా కొనసాగించటం మొదలుపెట్టారు. కోట్లు ఖర్చుపెట్టి చదువు‘కొన్న’ ఓ వైద్యవిద్యార్థి తన ఖర్చును రాబడిగా మార్చుకోకుండా ఎలా ఉండగలడు? నైతికతను కోల్పోయిన ప్రభుత్వ పెద్దలు ఎలా వీరిని కట్టడి చెయ్యగలరు? ప్రైవేటు వైద్యవిద్య పైన, ప్రైవేటు వైద్యరంగం పైన ప్రభుత్వం తన నియంత్రణ వదిలేయడంతో వైద్యవృత్తితో సంబంధంలేని పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు చేతులు కలిపి ఆసుపత్రులను నిర్వహించటం మొదలెట్టారు. ఇలాంటి ఆసుపత్రుల నిర్వాహకులకు లాభార్జన, శ్రమ దోపిడీ తప్ప మరేదీ పట్టదు. ఫలితంగా ప్రజలే కాదు, అటువంటి ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, మిగిలిన సిబ్బందితో సహా అంతా దోపిడీకి గురవుతున్నారు. ప్రజలను దోచుకుంటున్నది బడా పెట్టుబడిదారులే అయినప్పటికీ, సామాన్య జనం మాత్రం ఎదురుగా కనబడే వైద్యులనే తప్పుబడుతున్నారు, వారిపై దాడులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సమాజంపై దాడి చేసిన తొలినాళ్ళల్లో ప్రైవేటు వైద్యరంగమంతా ఎక్కడో దాక్కుంది. అత్యవసర పరిస్థితుల్లో బాధ్యత విస్మరించిన ప్రైవేటు రంగాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. ప్రైవేటు ఆసుపత్రులని ప్రభుత్వాలు స్వాధీనంలోకి తీసుకొని దేశ పౌరులందరికీ వాటిద్వారా సేవలు అందించి ఉంటే ఇంత అపార ప్రాణ నష్టం జరిగేది కాదు. కనీసం సెకండ్ వేవ్‌ సందర్భంలోనైనా ప్రభుత్వాలు ఈ పని చేయలేదు. 




ప్రైవేటు వైద్యరంగం కొవిడ్ చికిత్స బాధ్యత నుంచి తప్పుకున్న తొలిదశలో ఆ భారమంతా ప్రభుత్వ వైద్యరంగంపైన పడింది. ముక్కుతూ మూలుగుతూ అరకొర సౌకర్యాలతో నడుస్తున్న ఆయా ఆసుపత్రులను నెట్టుకొస్తున్న వైద్యులు, సహాయ సిబ్బంది ఆ భారాన్నంతా భుజానికెత్తుకొని అవిశ్రాంతంగా, అత్యంత భయానక పరిస్థితుల మధ్య ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పనిచేశారు. ఈ మహా క్రతువులో వైద్యులు, నర్సులు వందలాదిగా చనిపోయారు. స్వల్పవిరామం తరువాత విరుచుకుపడిన సెకండ్‌ వేవ్ కొత్త అవసరాల్ని తెరపైకి తెచ్చింది. తగినన్ని బెడ్లను సమకూర్చడంలో గానీ, తగినంత ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచటంలో గానీ, వైరస్‌ కొత్త రూపాలకు తగిన వైద్యాన్ని సూచించటంలో గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వరంగ వైద్యులు అపార ప్రాణ నష్టాన్ని నిలువరించలేకపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధన సంస్థలు కొవిడ్ లక్షణాల ఉపశమనానికి ఉద్దేశించిన కొన్ని ఔషధాలను ఎప్పటికప్పుడు సూచిస్తూండటంతో ఇదే అదనుగా ప్రైవేటు వైద్యరంగం రంగంలోకి దిగింది. ఔషధమే లేని వైద్యాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చింది. కొవిడ్ చికిత్సలో అనుభవం ఉన్నా, లేకున్నా చాలా ప్రైవేటు ఆసుపత్రులు రెండవ వేవ్ నాటికి చికిత్స మొదలెట్టాయి. అర్హతగల ఆసుపత్రులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపకపోవడంతో చిన్నా చితకా ఆసుపత్రులు సైతం కొవిడ్ దుకాణాలు తెరిచాయి. నిజానికి, మొదటి వేవ్‌లో ప్రైవేటు వైద్యులు అత్యధికకాలం చికిత్సకు దూరంగా ఉన్నందున ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు చిక్కినంత నైపుణ్యం ప్రైవేటు వైద్యుల దగ్గర లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికం వైద్యవృత్తితో సంబంధం లేని వారి యాజమాన్యంలో నిర్వహించబడేవే. ఫలితంగా రోగులు ఎంత ధనాన్ని కుమ్మరించినా ప్రాణాల్ని దక్కించుకోలేకపోయారు. ఈ ప్రక్రియలో జీతగాళ్లుగా పనిజేసే ప్రైవేటు వైద్యులకూ నష్టం వాటిల్లింది. ప్రజల ఉక్రోషం వైద్యులపై దాడులుగా రూపాంతరం చెందింది. 




ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలి. వైద్యరంగానికి ఉపకరించే యంత్ర సామగ్రిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి. ఔషధ కంపెనీలపై, అవి విధించే రేట్లపైన నియంత్రణ ఉండాలి. ప్రాణ రక్షణ మందులకు సబ్సిడీలు ఇవ్వాలి. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ అదుపును, నిఘాను పెంచాలి. వైద్యేతర రంగాలకు చెందిన వ్యక్తులు వైద్యవిద్యాసంస్థలను నిర్వహించేందుకు అనుమతించకూడదు. వైద్యవిద్యను కాలానుగుణంగా ఆధునికీకరించాలి. హోమియో, ఆయుర్వేద, యునాని వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలి. ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులను, డయాగ్నోస్టిక్ సెంటర్లు వసూలు చేస్తున్న చార్జీలను ప్రభుత్వమే నిర్ణయించి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వరంగ వైద్యాన్ని బలోపేతం చేయాలి. గ్రామీణ పట్టణ వైద్యాలయాలుగా కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని విరివిగా నియమించాలి. ఆయా వైద్యకేంద్రాల్లో అవస్థాపన, ఔషధ, యంత్ర సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సాధ్యమైనంత త్వరగా వైద్యుల సంఖ్యను పెంచాలి. ప్రతి వెయ్యి మంది పౌరులకు ఒక వైద్యుడిని తయారు చేసేటట్టుగా వైద్యవిద్యాలయాలు పెరగాలి. మన దేశంలో ఇప్పుడు ప్రతి 1500 మంది పౌరులకు ఒక వైద్యుడు ఉన్నారు. దాదాపు నాలుగు లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇప్పుడున్న వైద్యులు 40శాతం అదనపు భారాన్ని మోస్తున్నారు. నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టకుంటే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముంది.


మాకా రాజేంద్రన్


న్యాయవాది; సామాజిక హక్కుల కార్యకర్త

No comments:

Post a Comment