Jan 12 2022 @ 16:24PM
అమరావతి: కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్ అయింది. ఒమైక్రాన్ పేరుతో మందు పంపిణీపై ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులిచ్చింది. మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒమైక్రాన్ మందులో ఏమేం పదార్థాలు వాడుతున్నారో, చెప్పాలని ఆనందయ్యకు నోటీసుల్లో స్పష్టం చేశామన్నారు. ఆనందయ్య సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. లైసెన్స్ కోసం యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నారని, కానీ ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టలేదన్నారు. ఆనందయ్య అప్లికేషన్ పెడితేనే లైసెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు. కరోనా, ఒమైక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని రాములు సూచించారు.
‘‘కృష్ణపట్నం కరోనా మందు..’’ కొవిడ్ రోగుల పాలిట దివ్వఔషధం! కరోనా రాని వారికి కూడా వైరస్ సోకుకుండా అడ్డుకునే బ్రహ్మాస్త్రం! కరోనా సెకండ్‌వేవ్ కుదిపేస్తున్న వేళ ఆనందయ్య మందుపై చర్చ జరిగింది. ఈ మందుపై చాలా మందిలో ఏదో తెలియని ఆశ. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా దుర్లభంగా మారింది. ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో ఆనందయ్య మందు కోసం జనం తరలివచ్చారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది.